పరిపాలనలో మరింత పారదర్శకతకు నాంది పలికే ప్రయత్నంలో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు మంత్రులందరి తమ చర, స్థిరాస్తులను బహిరంగపరచాలని కోరారు. మంగళవారం జరిగిన మంత్రి మండలి ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి జారీ చేసిన పలు ఆదేశాల్లో ఇదీ ఒకటి. మంత్రుల కుటుంబ సభ్యుల జోక్యం ఉండకూడదని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు రాష్ట్రంలో పర్యటించాలని మంత్రులను కోరారు. సోమ, మంగళవారాల్లో లక్నోలో ఉండాలని.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు తమ నియోజకవర్గాలను సందర్శించాలని కూడా ఆయన ఆదేశించారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. "ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ప్రజా ప్రతినిధుల ప్రవర్తన చాలా ముఖ్యమైనది. గౌరవనీయులైన మంత్రులందరూ వ్యక్తిగత, కుటుంబ సభ్యులకు చెందిన అన్ని చర, స్థిరాస్తులను బహిరంగ ప్రకటన చేయాలి. మంత్రులకు సూచించిన ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలి, అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను స్ఫూర్తితో పాటించాలని అన్నారు.
పబ్లిక్ సర్వెంట్‌లందరూ కూడా (IAS/PCS) వ్యక్తిగత, కుటుంబ సభ్యులకు చెందిన అన్ని చర/స్థిర ఆస్తులను పబ్లిక్ డిక్లరేషన్ చేయాలని కోరారు. ఈ వివరాలను ప్రజల పరిశీలన కోసం ఆన్‌లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలని అన్నారు. దీంతో పాటు ప్రభుత్వ పనుల్లో తమ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకుండా మంత్రులందరూ చూసుకోవాలని అన్నారు.