మమతా పార్టీలోకి బీజేపీ సీనియర్ నేత.. మోదీపై నిప్పులు

Yashwant Sinha joins Trinamool Congress. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రతి రోజూ ఒక్కో మలుపు తిరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  13 March 2021 1:08 PM GMT
మమతా పార్టీలోకి బీజేపీ సీనియర్ నేత.. మోదీపై నిప్పులు

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రతి రోజూ ఒక్కో మలుపు తిరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! మమతా బెనర్జీ కాలికి గాయమైన ఘటన గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎంటర్ అయ్యారు. యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం కీలక పరిణామం. నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక 2018లో యశ్వంత్ సిన్హా బీజేపీ ని వీడిన సంగతి తెలిసిందే..!

డెరెక్ ఓ బ్రయన్, సుదీప్ బందోపాధ్యాయ, సుబ్రతా ముఖర్జీల సమక్షంలో కోల్ కతాలోని తృణమూల్ భవన్ లో ఆ పార్టీలో చేరారు. అంతకు ముందు పార్టీ చీఫ్ మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిసి.. పరామర్శించారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మరింత శక్తిమంతంగా ఉంటుందని, ఇప్పుడు న్యాయ వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ భ్రష్ఠు పట్టిపోయాయని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎవరూ ఆపలేకపోతున్నారని విమర్శించారు. వాజ్ పేయి హయాంలో బీజేపీ అందరి అభిప్రాయాలను తీసుకునేదని, కానీ, మోదీ హయాంలో అణచి వేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్డీయే నుంచి అకాలీ దళ్, బీజేడీ వంటి పార్టీలు బయటకొచ్చేశాయని.. అణచివేస్తుంటే ఎవరు మాత్రం ఉంటారని అన్నారు. ఎన్నికల సంఘం తటస్థంగా ఉండట్లేదని విమర్శించారు.


Next Story
Share it