డిఫెన్స్ లో మహిళలకు ఛాన్స్

Women will be allowed to enter National Defence Academy. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) లోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించే నిర్ణయం

By Medi Samrat  Published on  8 Sept 2021 4:13 PM IST
డిఫెన్స్ లో మహిళలకు ఛాన్స్

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) లోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించే నిర్ణయం తీసుకున్నట్లు సెప్టెంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మంగ‌ళ‌వారం రాత్రి ఈ నిర్ణ‌యం తీసుకున్నారని అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఐశ్వ‌ర్య భాటి సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే, వారికి ప్రవేశాలు కల్పించేందుకుగానూ మార్గదర్శకాలను తయారు చేసేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరింది. దానికి సమ్మతించిన కోర్టు ఈ నెల 20లోపు వెల్లడించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది. ఎన్డీయేలోకి అమ్మాయిలను తీసుకునేందుకు సాయుధ బలగాలు ఒప్పుకోవడం ఆనందంగా ఉందని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక్కరోజులోనే సంస్కరణలన్నీ జరిగిపోవన్న విషయం తమకూ తెలుసని, అమ్మాయిలను ఎన్డీయేలోకి తీసుకునే ప్రక్రియ, చర్యలకు కేంద్రం కొంత సమయం తీసుకోవచ్చని సూచించింది.

సాయుధ దళాలు గౌరవనీయమైన సంస్థ అని, అయితే లింగ సమానత్వానికి సంబంధించి మరిన్ని సంస్కరణలను చేయాల్సి ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. దేశ రక్షణలో సాయుధ బలగాలు కీలకపాత్ర పోషిస్తాయని, అయితే, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు బలగాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఎన్డీయేతో పాటు నేవల్ అకాడమీలో అమ్మాయిలకూ అవకాశం కల్పించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఎన్డీయే పరీక్షను అమ్మాయిలూ రాయవచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణ తేదీ అయిన సెప్టెంబర్ 22 లోగా దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది.


Next Story