కర్ణాటక కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే శుక్రవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు, "రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి పురుషులు లంచం ఇవ్వాలి, యువతులు ఎవరితోనైనా పడుకోవాలి" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల పేరుతో చేస్తున్న స్కామ్‌లపై న్యాయ విచారణ చేయించాలని.. వీలైతే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేత విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.
వివిధ ఉద్యోగాల నియామకాల్లో బీజేపీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఖర్గే విరుచుకుపడ్డారు. పోస్టులు అమ్ముకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, యువతులకు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఎవరితోనైనా పడుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పురుషులు లంచాలు ఇవ్వాల్సిందేనని ఖర్గే అన్నారు. 'ఉద్యోగం ఇప్పించడం కోసం ఓ యువతిని తనతో పడుకోమని మంత్రి అడిగాడు. కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతను రాజీనామా చేశాడు' ఇది ఇక్కడ జరుగుతున్న దారుణాలకు సాక్ష్యం అని ఆయన అన్నారు. ''ప్రతి రిక్రూట్‌మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగితే పేద, ప్రతిభావంతులైన విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలి.. ఏదైనా స్కామ్ వెలుగులోకి వచ్చినా తమకు ఏమీ జరగదని నిందితులకు, దళారులకు తెలుసు.. సుమారు 3 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోంది'' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం చేపట్టిన 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని కూడా విమర్శించారు. దేశభక్తిని కూడా బీజేపీ వ్యాపారం కోసం ఉపయోగిస్తోందని విరుచుకుపడ్డారు.