షాకింగ్ : నాలుగు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు కరోనా పాజిటివ్.!
Woman infected even after getting 4 vaccines. ఇండోర్ విమానాశ్రయంలో బుధవారం ఓ 44 ఏళ్ల మహిళ కరోనా వైరస్ బారిన పడింది.
By Medi Samrat Published on 29 Dec 2021 7:27 PM ISTఇండోర్ విమానాశ్రయంలో బుధవారం ఓ 44 ఏళ్ల మహిళ కరోనా వైరస్ బారిన పడింది. దుబాయ్‌కి చెందిన ఆ మహిళను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అయితే.. ఆ మహిళ ఇప్పటికే రెండు వేర్వేరు కొవిడ్ వ్యాక్సిన్‌లు.. మొత్తం నాలుగు డోసులను తీసుకుంది. ఈ విషయమై వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక కౌరవ మాట్లాడుతూ.. "ఇండోర్-దుబాయ్ విమానంలో ప్రయాణించే ప్రతి ప్రయాణీకుడికి స్థానిక విమానాశ్రయంలో వారానికొకసారి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తారు. నిర్దేశించిన విధానం ప్రకారం.. ఈ రోజు కూడా 89 మంది ప్రయాణీకులను పరీక్షించారు. అందులో టెస్టులు చేయించుకున్న ఓ 44 ఏళ్ల మహిళకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. పాజిటివ్ వచ్చిన ఆమె దుబాయ్‌కి చెందిన మహిళ. ఇండోర్ సమీపంలోని మోవ్‌లో వివాహానికి హాజరయ్యేందుకు 12 రోజుల క్రితం భారత్‌కు వచ్చినట్లు తెలిపారు.
అదే సమయంలో జనవరి నుండి ఆగస్టు వరకు మహిళ సినోఫార్మ్, ఫైజర్ యొక్క యాంటీ కోవిడ్ వ్యాక్సిన్‌ల రెండు డోసులను తీసుకుంది. అయినా విమానాశ్రయంలో జరిగిన ఆర్టీపీసీఆర్ తనిఖీలో మహిళకు పాజిటివ్ వచ్చినట్లు గుర్తించినట్లు డాక్టర్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆమెకు జలుబు, దగ్గు సమస్య ఉందని విమానాశ్రయంలోని ఆరోగ్య శాఖ బృందానికి తెలిపినట్లు వారు చెప్పారు. మహిళ ప్రస్తుతం ఇండోర్‌లోని ప్రభుత్వ మనోరమ రాజే టిబి ఆసుపత్రిలో చేరిందని డాక్టర్ చెప్పారు. ఇంతకుముందు.. సెప్టెంబర్ 15న ఇండోర్-దుబాయ్ విమానంలో 26 ఏళ్ల వ్యక్తిని, అక్టోబర్ 13న 68 ఏళ్ల మహిళను, అక్టోబర్ 27న 72 ఏళ్ల మహిళను ఎక్కకుండా ఆపారు. వారికి ఆయా బుధవారాలలో జరిపిన టెస్టులలో వైరస్ సోకినట్లు గుర్తించడంతో అలా చేసినట్లు విమానాశ్రయవర్గాలు తెలిపాయి.