మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ సమీపంలోని జబల్‌పూర్‌లో ఒక మహిళ తన కుమారుడిని పులి నుండి కాపాడుకోడానికి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. రోహనియా గ్రామంలో పులి దాడిలో.. మహిళ, ఆమె కొడుకు ఇద్దరూ గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు.
"పులి బయట తిరుగుతోందని (టైగర్ రిజర్వ్ వెలుపల), ప్రజలు పులిని చూడటానికి వస్తున్నారని మాకు సమాచారం అందింది. కానీ మహిళకు పులి గురించి తెలియదు. ఆ సమయంలో ఒక్కసారిగా పులి మహిళపై దాడి చేసింది. తన పిల్లాడిని కాపాడుకోడానికి ఆమె చాలా ప్రయత్నించింది. దాడిలో వారిద్దరూ గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వారిని జబల్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం, తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు" అని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ మేనేజర్ లవిత్ భారతి ANIకి తెలిపారు.
తల్లి పొలం పనులు చేస్తుండగా ఏడాదిన్నర బాలుడిపై పులి దాడి చేసింది. ఆ స్త్రీ తన బిడ్డకు రక్షణగా ఉండి, పులి చేసే ప్రతి దాడిని ఎదుర్కొంటూనే ఉంది. పులి నుంచి రక్షించుకోవడానికి ఆ మహిళ వద్ద ఎలాంటి ఆయుధం లేదు. ఆమె సహాయం కోసం అరుస్తూనే ఉంది, వెంటనే గ్రామస్థులను అప్రమత్తం చేసింది. వారు పులిని తరిమికొట్టారు. చిన్నారి తలకు గాయాలు కాగా.. తల్లి శరీరమంతా గాయాలయ్యాయి.