వారంతా పేదలు కావడంతో సొంతింటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. తొలి విడుతగా రూ.50వేలు వారి అకౌంట్లలో జమ చేసింది. ఇంకేముంది ఇదే అదును అని బావించిన ఓ ఐదుగురు భార్యా మణులు తమ భర్తలను వదిలి వేసి ప్రియుళ్లతో కలిసి వెళ్లిపోయారు. దీంతో భర్తలు అధికారుల వద్దకు పరుగులు తీశారు. ఎట్టి పరిస్థితుల్లో రెండో విడుత డబ్బులు వారి అకౌంట్లలో వేయవద్దు అని అధికారులను వేడుకుంటున్నారు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎం ఆవాస్ యోజన) కింద పట్టణ ప్రాంతాల్లో పేద వర్గాల ప్రజలకు పక్కా ఇల్లు కట్టించేందుకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోంది. బారాబంకీ జిల్లా పరిధిలోని నగర పంచాయతీ బెల్హారా, బంకీ, జైద్ పూర్, సిద్దౌర్‌కు చెందిన 40 మహిళలు లబ్ధిదారులుగా ఎంపిక అయ్యారు.
ఇటీవల అధికారులు వీరి ఖాతాలో తొలి విడుతగా రూ.50వేలు చొప్పున జమ చేశారు. ఇలా అకౌంట్‌లో డబ్బు పడిందో లేదో అలా ఓ ఐదుగురు మహిళలు తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో కలిసి పారిపోయారు. దీంతో ఎట్టిపరిస్థితుల్లో తమ భార్యల ఖాతాల్లో రెండో విడుత డబ్బులు వేయొద్దు అని అధికారులకు సదరు మహిళల భర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.