'మీ బిడ్డను ఆ స్కూలు నుంచి బయటకు తీసుకెళ్లండి..' ఆత్మహత్యకు ముందు మహిళకు సలహా ఇచ్చిన విద్యార్థి
ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్‌లో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీప్శిఖ అనే మహిళ ఆ విద్యార్థిని చివరిసారిగా చూసింది.
By - Medi Samrat |
ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్‌లో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీప్శిఖ అనే మహిళ ఆ విద్యార్థిని చివరిసారిగా చూసింది. ఆ విద్యార్థి చాలా మనస్తాపం చెందాడని, ఉపాధ్యాయులు తనను వేధించారని చెప్పిందని ఆ మహిళ చెప్పింది. నవంబర్ 18న తాను కిషోర్‌తో కలిసి ఒకే రిక్షా ఎక్కానని దీప్శిఖ తెలిపింది.
ఆమె మాట్లాడుతూ, “నేను నా బిడ్డను ప్రతిరోజూ రిక్షాలో పాఠశాల నుండి ఇంటికి తీసుకువస్తాను, కాని నవంబర్ 18 మధ్యాహ్నం, నేను నా కొడుకుతో కలిసి రిక్షాలో కూర్చున్నప్పుడు, అతడు (మృతుడు) అకస్మాత్తుగా పరుగెత్తుకుంటూ వచ్చి త్వరగా రిక్షాలో కూర్చున్నాడు. వేగంగా వెళ్లమని డ్రైవర్‌ని పదే పదే కోరాడు. అతడు చాలా బాధపడినట్లు కనిపించాడు. ఏమి జరిగిందని నేను అతనిని అడిగాను, అతడు “నీ కొడుకును స్కూల్ నుండి బయటకు తీసుకెళ్లండి” అన్నాడు. నాకు బోర్డ్ పరీక్షలు వస్తున్నాయి. ఉపాధ్యాయులు నన్ను చాలా వేధిస్తున్నారు. ఎంత అని కూడా చెప్పలేను.. నా తల్లిదండ్రులను పదే పదే పాఠశాలకు పిలుస్తున్నారని వాపోయినట్లు పేర్కొంది.
రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 10వ తరగతి విద్యార్థి.. తన పాఠశాల ఉపాధ్యాయులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక నోట్‌ను రాశాడు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. విద్యార్థి రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 నుండి దూకినట్లు ఆరోపణలు ఉన్నాయి.
శనివారం పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ శుక్రవారం తెలిపారు. సూద్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయంలో పాఠశాలలు కఠిన చర్యలు తీసుకున్నాయని చెప్పారు. సిబిఎస్‌ఇ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థుల మానసిక ఆరోగ్యం, మొత్తం శ్రేయస్సును వారు పర్యవేక్షిస్తున్నారా అని అడుగుతూ పాఠశాలలకు లేఖ రాస్తానని ఆయన చెప్పారు. మరోవైపు ఢిల్లీలోని సెంట్రల్ స్కూల్ తన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది.