జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది, వైద్య చికిత్స కోసం అందించే వీసా సేవలను కూడా రద్దు చేసింది. వీసా సేవలను పూర్తిగా నిలిపివేసింది. పహల్గామ్ దాడి తర్వాత భద్రతపై క్యాబినెట్ కమిటీ లేదా CCS తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
పాక్ పౌరులకు చెల్లుబాటయ్యే అన్నీ వీసాలను ఏప్రిల్ 27 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన అన్నీ వైద్య వీసాలు ఏప్రిల్ 29 మంగళవారం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. తరచుగా మానవతా దృక్పథంతో పొడిగించే వైద్య వీసాలకు కూడా పరిమిత సమయం ఇచ్చారు. అవి ఏప్రిల్ 29, 2025 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. భారతదేశం పాకిస్తానీ జాతీయులకు వీసా సేవలను పూర్తిగా నిలిపివేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు కొత్త వీసాలు ప్రాసెస్ చేయబడవని తెలిపింది.