ప్రస్తుతానికైతే వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే..!

Wipro goes back to office. కరోనా కారణంగా పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను ప్రకటించిన విష‌యం తెలిసిందే

By Medi Samrat  Published on  13 Sep 2021 2:15 PM GMT
ప్రస్తుతానికైతే వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే..!

కరోనా కారణంగా పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను ప్రకటించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త మారుతూ ఉండడం.. డబుల్ డోస్ వ్యాక్సిన్లు కూడా పలువురికి ఇస్తూ ఉండడంతో టెక్ కంపెనీలు కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి చెప్పాలని భావిస్తూ ఉన్నాయి. తాజాగా విప్రో సంస్థ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. నేటి (సోమవారం) నుంచి కార్యాలయాలకు రావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే, కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతానికైతే వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని సంస్థ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్వీట్ చేశారు. 18 నెలల సుదీర్ఘకాలం తర్వాత తమ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రాబోతున్నారని.. వ్యాక్సినేషన్ పూర్తయిన వారు నేటి నుంచి వారానికి రెండు రోజులు ఆఫీసు నుంచే పనిచేస్తారని తెలిపారు. వారు ఆఫీసుకి సురక్షితంగా వచ్చి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా షేర్ చేశారు.

విప్రోలో ప్రస్తుతం దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది కొవిడ్‌ టీకాలు తీసుకున్నారు. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారినే కార్యాలయాలకు అనుమతిస్తామని రిషాద్ ప్రేమ్‌జీ తెలిపారు. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ, ఉద్యోగులు సురక్షితంగా వచ్చి వెళ్లేలా, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రత నిమిత్తం కార్యాలయాల్లో చేసిన ఏర్పాట్లకు సంబంధించి ఓ వీడియోను కూడా ఆయన ట్వీట్ చేశారు.


Next Story
Share it