'నేను జీవించడానికి ఒక కారణం ఉండాలి'.. నా భర్తకు 'అమరవీరుడు' హోదా ఇవ్వండి
పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పెళ్లయిన జంటలను కూడా ఉగ్రవాదులు వదల్లేదు.
By Medi Samrat
పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పెళ్లయిన జంటలను కూడా ఉగ్రవాదులు వదల్లేదు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నివసిస్తున్న శుభం ద్వివేది కూడా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని భార్య ఆశన్య తన భర్తకు 'అమరవీరుడు' హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. శుభమ్‌పై ఉగ్రవాదులు తొలి బుల్లెట్‌ను ప్రయోగించారని ఆశన్య తెలిపింది. శుభం ద్వివేది ఉగ్రవాదులతో వాగ్వాదం సందర్భంగా చాలా మందికి పారిపోయే అవకాశం లభించిందని.. అలా ప్రాణాలను కాపాడారని పేర్కొంది.
మీడియా నివేదికల ప్రకారం.. శుభమ్ తనను తాను హిందువునని గర్వంగా చెప్పుకున్నాడని.. చాలా మంది ప్రాణాలను రక్షించాడని అశాన్య చెప్పింది. మొదటి బుల్లెట్ నా భర్తకు తగిలింది. ఉగ్రవాదులు మతం గురించి అడిగారు. ఈ చర్చకు కొంత సమయం పట్టింది, ఇది పర్యాటకులు అక్కడి నుండి తప్పించుకోవడానికి సహాయపడింది. ప్రభుత్వం నుంచి నాకు ఇంకేమీ అక్కర్లేదు. నా భర్తకు 'అమరవీరుడు' హోదా ఇవ్వండి. ప్రభుత్వం నా అభ్యర్థనను అంగీకరిస్తే నేను జీవించడానికి కారణం దొరుకుతుందని డిమాండ్ చేసింది.
ఏప్రిల్ 22న బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 31 ఏళ్ల శుభమ్ ద్వివేదిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. కాన్పూర్ నివాసితులైన శుభమ్, అశాన్య ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హాలిడే ఎంజాయ్ చేద్ధామని జమ్మూకశ్మీర్ వెళ్లారు. కానీ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో అశాన్య శుభమ్ ద్వివేదిని కోల్పోయింది.
ఈ ప్రమాదం నుంచి ఆశన్య ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ.. బైసరన్ వ్యాలీలో తామిద్ధరం కూర్చుని మ్యాగీ తింటున్నామని.. అప్పుడు ఆర్మీ యూనిఫారంలో ఉన్న ఒక వ్యక్తి వెనుక నుండి వచ్చి మేము హిందువులా లేదా ముస్లిమా అని అడిగాడు. ఎవరైనా తమాషా చేస్తున్నారేమో అనుకున్నాం. నేను అన్నాను ఎందుకు బ్రదర్, ఏమైంది? అఏదుకు ఆయన మళ్లీ అదే విషయాన్ని రిపీట్ చేశారు, హిందువా లేదా ముస్లిమా? మేము హిందూ అని చెప్పాము. దీంతో అతడు శుభమ్ తలపై కాల్చాడు. ఇదంతా చాలా త్వరగా జరిగింది, నాకు ఏమీ అర్థం కాలేదని ఘటనను వివరించింది. తన భర్త చనిపోయిన తర్వాత ఆశాన్య ఉగ్రవాదులు తనను కూడా చంపితే చంపమని అభ్యర్థించింది. కానీ, అందుకు నిరాకరించారు. నిన్ను చంపబోమని ఉగ్రవాదులు చెప్పారు. మీరు వెళ్లి మేమేం చేశామో ప్రభుత్వానికి చెప్పడానికి మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెడుతున్నామన్నాడు.
బైసరన్ వ్యాలీలో భద్రతా బలగాలను మోహరించలేదని శుభమ్ తండ్రి సంజయ్ ద్వివేది తెలిపారు. ఘటన జరిగిన గంట తర్వాత భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంతలో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారని పేర్కొన్నారు.