మహరాష్ట్రలో కరోనా కారణంగా మూసివేసిన ఆలయాలన్నింటినీ పది రోజుల్లోగా తెరవాలని అన్నా హజారే డిమాండ్ చేశారు. పది రోజుల్లో ఆలయాలను తెరవని పక్షంలో మందిర్ బచావ్ కృతి సమితి జైల్ భరో నిర్వహిస్తుందని.. అందుకు తన మద్దతు ఉంటుందని అల్టిమేటం జారీచేశారు. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు సహా వైన్ షాపులు తెరుస్తున్న వేళ ఆలయాలను తెరవడంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్‌డౌన్ ఆంక్షల వల్ల గత ఏడాదిన్నర నుంచి ప్రార్థనా స్థలాలన్నీ మూసే ఉంటున్నాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో.. బార్లు, వైన్ షాపులు, హోటళ్లు, వివిధ వ్యాపార రంగ సంస్థలు తెరుస్తున్నారు.
దీంతో ఆలయాలను కూడా తెరవాలని గత కొద్ది నెలలుగా ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేఫథ్యంలోనే అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన మందిర్ బచావ్ కృతి సమితి బృందం రాళేగణ్‌సిద్ధి గ్రామంలో అన్నా హాజారేతో భేటీ అయి ఓ నివేదికను అందజేసింది. ఆ నివేదికను పరిశీలించిన హజారే.. ఆలయాలను మూసివేసి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. మందిరాలకు వచ్చే భక్తులు కోవిడ్ నియమాలు కచ్చితంగా పాటిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా ఆలయాలను తెరిచేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.