హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎం పదవి నుండి తనను త‌ప్పించ‌నున్నార‌ని వ‌స్తున్న‌ ఊహాగానాల‌పై స్పందించారు

By Medi Samrat  Published on  3 Sep 2024 11:35 AM GMT
హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎం పదవి నుండి తనను త‌ప్పించ‌నున్నార‌ని వ‌స్తున్న‌ ఊహాగానాల‌పై స్పందించారు. పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధరామయ్య చెప్పారు. తన స్వగ్రామం మైసూరులో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ సీఎం సిద్ధరామయ్య ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మాజీ మంత్రి, సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే ప్రకటనపై సీఎం స్పందించారు. ముఖ్యమంత్రి పదవిని కొత్త వ్య‌క్తితో భర్తీ చేస్తే తాను ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్వీ దేశ్‌పాండే వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. “సీఎంను ఎలా మారుస్తారు? దీనిపై పార్టీ ఎమ్మెల్యేలు, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటానని స్ప‌ష్టం చేశారు.

ముడా కేసు నేపథ్యంలో సీఎం నిస్తేజంగా కనిపిస్తున్నార‌నే బీజేపీ వ్యాఖ్య‌ల‌పై.. సీఎం సిద్ధరామయ్య నవ్వుతూ.. “ఈ విషయంలో ప్రతిపక్షాలు అబద్ధాలు చెప్పాయి. వారి అబద్ధం రుజువు కాకపోతే వారికి కష్టమే. నేను అబద్ధాలు చెప్పలేదు, తప్పుడు ప్రకటనలు చేయలేదు.. నేను ఏ తప్పు చేయలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కోవిడ్‌పై జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను బీజేపీకి వ్యతిరేకంగా ఉపయోగిస్తుందనే ప్రశ్నకు సమాధానంగా.. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను గురువారం మంత్రివర్గం ముందు ఉంచబోతున్నట్లు చెప్పారు. కమీషన్ సిఫార్సు గురించి నాకు తెలియదు. మేము దానిని పరిశీలిస్తామన్నారు.

Next Story