కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు 16 మంది పిల్లల్ని కనాలి: ఎంకే స్టాలిన్
దక్షిణ భారతదేశంలో యువత జనాభా తగ్గిపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 21 Oct 2024 3:57 PM ISTదక్షిణ భారతదేశంలో యువత జనాభా తగ్గిపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, కొత్తగా పెళ్లయిన జంటలకు 16 మంది పిల్లలు పుట్టే సమయం ఆసన్నమైందని తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. చెన్నైలో హిందూ రిలిజియస్ అండ్ ఎండోమెంట్ బోర్డ్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయం చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ సమక్షంలో 31 జంటలు పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. బహుశా దంపతులకు 16 రకాల ఆస్తులకు బదులు 16 మంది పిల్లలు పుట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. సీఎం ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ.. మన జనాభా తగ్గుతోందని.. ఇది మన లోక్‌సభ స్థానాలపై కూడా ప్రభావం చూపుతుందని.. అలాంటప్పుడు ఒక్కొక్కరు 16 మంది పిల్లలను పుట్టించాలని అన్నారు.
పూర్వం పెద్దలు కొత్తగా పెళ్లయిన జంటలకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆశీర్వదించేవారు. బహుశా 16 రకాల ఆస్తులకు బదులు 16 మంది పిల్లలను కనే సమయం వచ్చిందన్నారు. తమిళంలో పాత సామెత ఉంది, ‘పదినరౌమ్ పెట్రు పెరు వజ్వు వళగ’.. అంటే దంపతులకు 16 రకాల ఆస్తులు ఉండాలి, కానీ నేడు లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గుతున్న సమయంలో తక్కువ మంది పిల్లలను కనడానికే ఎందుకు పరిమితం కావాలి.? 16 మందిని ఎందుకు కనకూడదు అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో జనాభా రేటు (న్యూ పాపులేషన్ పాలసీ) పెంచేందుకు తమ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలని యోచిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దీని ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయగలరు. దీనికి సంబంధించి త్వరలో చట్టం చేయాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని సీఎం చంద్రబాబు ఆదివారం తెలిపారు. ‘జనాభా నిర్వహణ’ను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని సీఎం నాయుడు శనివారం (అక్టోబర్ 19) తెలిపారు.