కొత్త ప్రభుత్వంపై విరుచుకుపడిన ఉద్ధవ్ థాకరే
Why did BJP refuse to share CM chair in the past. ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయిన తర్వాత మొదటి సారి ఉద్ధవ్ థాకరే
By Medi Samrat Published on 1 July 2022 11:42 AM GMTముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయిన తర్వాత మొదటి సారి ఉద్ధవ్ థాకరే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తన మొదటి ప్రసంగంలో ఉద్ధవ్ భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ఇప్పుడేమో అధికారాన్ని త్యాగం చేసిందని.. అయితే గతంలో శివసేనతో సిఎం కుర్చీని పంచుకోవడానికి పార్టీ ఎందుకు నిరాకరించిందని ప్రశ్నించారు.
శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండేకు మహారాష్ట్ర కొత్త సీఎంగా పట్టాభిషేకం చేస్తూనే, ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రోత్సహించడాన్ని థాకరే ప్రస్తావించారు. "ముఖ్యమంత్రి పదవి రాకపోవడంతో బీజేపీకి ఎలాంటి ఆనందం వచ్చిందో అర్థం కావడం లేదు" అని థాకరే వ్యాఖ్యానించారు. తమ పార్టీలో జరిగిన తిరుగుబాటు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, ప్రజల ఓట్లను వృధా చేయడమేనని శివసేన అధిష్టానం అభివర్ణించింది.
భావోద్వేగానికి లోనైన థాకరే, బీజేపీ తనకు ద్రోహం చేసినట్లు ప్రజలకు ద్రోహం చేయవద్దని కోరారు. "నాకు వెన్నుపోటు పొడిచారు కానీ ముంబైకి వెన్నుపోటు పొడవకండి. ఆరే నిర్ణయం మార్చుకున్న తీరు సరికాదన్నారు. మేము మరొక ప్లాట్‌ను సూచించాము. పర్యావరణానికి విఘాతం కలిగించేలా నిర్ణయం మారినందుకు నేను అసంతృప్తిగా ఉన్నాను. ముంబైని ఇబ్బంది పెట్టవద్దు, పర్యావరణ సమస్యలను సృష్టించవద్దు, "అని ఆయన చెప్పుకొచ్చారు. "మెట్రో కార్ షెడ్ ప్రాజెక్ట్ ఆరేలో కాకుండా కంజుర్‌మార్గ్‌లో ఉండనివ్వండి. కంజుర్‌మార్గ్ ప్రైవేట్ ప్లాట్ కాదు. పర్యావరణవేత్తలతో కలిసి ఆరేను రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌గా ప్రకటించాను. ఆ అడవిలో వన్యప్రాణులు ఉన్నాయి,"అన్నారాయన.
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుకు షాక్ ఇచ్చిన ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన తిరుగుబాటు వర్గానికి మద్దతు ప్రకటించిన విపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.