సోషల్ మీడియాలో ఎప్పుడు.. ఎవరు.. ఎలా.. ఎందుకు ఫేమస్ అవుతారో అసలు ఊహించలేం. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు 'కచ్చా బాదం' పాట వినిపిస్తూ ఉంది. కొందరు కచ్చా బాదం పాట మీద డ్యాన్స్ చేస్తున్నారు ఈ పాట పాడిన గాయకుడు భుబన్ బద్యాకర్ బాగా ఫేమస్ అయ్యాడు. బెంగాలీ భాషలో 'కచ్చా బాదం' అంటే 'పచ్చి వేరుశెనగ' అని అర్థం. బెంగాలీలో వేరుశెనగను బాదం అంటారు. ఏవైనా వస్తువులు అమ్మే వాళ్లు అనేక రకాల శబ్దాలు చేస్తూ ఉంటారు. అయితే భుబన్ బద్యాకర్ తన వేరుశెనగలను విక్రయించడానికి పాటలు పాడుతూ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటారు. ప్రజలు అతని శైలిని ఇష్టపడ్డారు. అతని వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన వేరుశెనగ విక్రయదారుడు భుబన్ బద్యాకర్ స్వయంగా 'కచ్చా బాదం' పాటను కంపోజ్ చేశాడు. ఈ పాట బెంగాల్ గిరిజన బౌల్ జానపద పాట ఆధారంగా రూపొందించబడింది. భుబన్ బీర్భూమ్ జిల్లా దుబ్రాజ్‌పూర్ బ్లాక్ పరిధిలోని కురల్జూరి గ్రామ నివాసి. భుబన్ కుటుంబంలో భార్య, 2 కుమారులు, 1 కుమార్తెతో సహా మొత్తం 5 మంది సభ్యులు ఉన్నారు. భుబన్ మొబైల్స్ వంటి విరిగిన వస్తువులకు బదులుగా వేరుశెనగ అమ్ముతారు. రోజూ 3-4 కిలోల వేరుశనగ అమ్ముతూ రూ.200-250 వరకు సంపాదిస్తున్నారు. ఇప్పుడు అతని పాట వైరల్ కావడంతో, అతని అమ్మకాలు పెరిగాయి. వెబ్‌సైట్‌తో మాట్లాడిన భుబన్, 'నా పాట గురించి ప్రజలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను, నా కుటుంబం జీవించడానికి ప్రభుత్వం ఏదైనా శాశ్వత ఏర్పాటు చేయాలి. వారికి మంచి ఆహారం తినిపించాలని, వారికి మంచి బట్టలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.' అని తెలిపారు. భుబన్ పాటను రీమిక్స్ చేసి తెగ వైరల్ చేస్తూ ఉన్నారు.