ముంబైలోని ఎంపీ నవనీత్ రాణా, బద్నేరా స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాల ఇంటి ముందు శివసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు తాము హనుమాన్ చాలీసాను పఠిస్తామని ఎంపీ నవనీత్ దంపతులు హెచ్చరించిన నేపథ్యంలో శనివారం శివసేన కార్యకర్తలు ఎంపీ ఇంటి ముందు నిరసన తెలిపారు. మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సేన కార్యకర్తలు రానాను బెదిరించారు.
శివసేన కార్యకర్తల తీరుపై నవనీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నివాసం వద్ద దౌర్జన్యం చేయాలంటూ శివసేన కార్యకర్తలను ముఖ్యమంత్రే ఆదేశించారని ఆరోపించారు. వారు బ్యారికేడ్లను సైతం తోసివేస్తూ ముందుకు వస్తున్నారని వివరించారు. తాను మరోసారి చెబుతున్నానని, థాకరేల నివాసం మాతోశ్రీ వద్దకు వెళ్లి హనుమాన్ చాలీసా పఠించి తీరుతానని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు వీఐపీ భద్రత కల్పించింది. నవనీత్ కౌర్ భద్రతకు ముప్పు ఉందని కేంద్ర నిఘా సంస్థ ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖకు నివేదిక అందజేసింది. నిఘా సంస్థ సిఫారసులకు ఆమోదం తెలిపిన కేంద్ర హోంశాఖ పారామిలిటరీ సాయుధ కమాండోలతో నవనీత్ కు 'వై' కేటగిరీ (సెంట్రల్ కవర్) భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ముగ్గురు నుంచి నలుగురు సీఐఎస్ఎఫ్ కమాండోలు నవనీత్ భద్రతా విధుల్లో పాల్గొంటారు.