Wheat Prices : పండుగ‌ల ముందు టెన్ష‌న్ పెడుతున్న గోధుమ పిండి ధ‌ర‌లు

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యులను ఇబ్బంది పెడుతోంది. కొద్దిరోజులుగా పచ్చి కూరగాయల ధరలు, ఎడిబుల్ ఆయిల్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటా ధరలు పెరుగుతుండ‌గా.. తాజాగా సామాన్యుడి తినే రొట్టె కూడా ఖరీదైన‌దిగా మారనుంది

By Medi Samrat  Published on  17 Sept 2024 2:32 PM IST
Wheat Prices : పండుగ‌ల ముందు టెన్ష‌న్ పెడుతున్న గోధుమ పిండి ధ‌ర‌లు

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యులను ఇబ్బంది పెడుతోంది. కొద్దిరోజులుగా పచ్చి కూరగాయల ధరలు, ఎడిబుల్ ఆయిల్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటా ధరలు పెరుగుతుండ‌గా.. తాజాగా సామాన్యుడి తినే రొట్టె కూడా ఖరీదైన‌దిగా మారనుంది. ఎందుకంటే గోధుమల ధరలు పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా గోధుమ పిండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోధుమల‌ సరఫరా దెబ్బతినడం వల్ల ఈ పెరుగుదల కనిపిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్‌లలో గోధుమ పిండి కనీస ధర 20 శాతం వరకూ పెరిగింది. పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం గోధుమల నిల్వ పరిమితిని సవరించింది.

దసరా-దీపావళికి ముందు పెరిగిన గోధుమ పిండి ధరలు సామాన్య ప్రజల కష్టాలను పెంచాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో పిండి కనీస ధర క్వింటాల్‌కు రూ.2,250 నుంచి దాదాపు రూ.2800కి పెరిగింది. దీంతో బ్రెడ్, మఫిన్లు, నూడుల్స్, పాస్తా, బిస్కెట్లు, కేకులు, కుకీలు వంటి గోధుమ పిండితో తయారయ్యే అన్ని ఉత్పత్తుల ధరలపై ప్రభావం ఉండ‌నుంది.

పెరుగుతున్న పిండి ధరలపై స్పందిస్తూ.. దేశంలో తగినన్ని గోధుమల‌ లభ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆహార భద్రతను నిర్వహించడానికి, హోర్డింగ్, స్పెక్యులేషన్‌ను నిరోధించడానికి, భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వ్యాపారులు, టోకు వ్యాపారులు, రిటైలర్లు, పెద్ద గొలుసు వ్యాపారులు, ప్రాసెసర్‌లకు వర్తించే గోధుమ స్టాక్ పరిమితులను సవరించింది. 2024 రబీలో మొత్తం 1,129 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించారు.

అన్ని గోధుమ నిల్వ సంస్థలను గోధుమ స్టాక్ పరిమితి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ప్రతి శుక్రవారం స్టాక్ స్థితిని అప్‌డేట్ చేయాలని సూచనలు చేసింది. ఈ స్టాక్ పరిమితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పర్యవేక్షిస్తారు.

Next Story