'బెయిల్ మంజూరు చేసిన‌ మరుసటి రోజే మంత్రి అయ్యారు'.. సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు చివాట్లు

డీఎంకే నేత సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది.

By Medi Samrat  Published on  2 Dec 2024 2:45 PM IST
బెయిల్ మంజూరు చేసిన‌ మరుసటి రోజే మంత్రి అయ్యారు.. సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు చివాట్లు

డీఎంకే నేత సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది. బెయిల్ పొందిన వెంటనే వి.సెంథిల్ బాలాజీకి తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వ‌డంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సాక్షులపై కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన తర్వాత సెంథిల్ బాలాజీ సెప్టెంబర్ 26న జైలు నుంచి విడుదలయ్యారు. సెప్టెంబర్ 26 నాటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. సెంథిల్ బాలాజీకి మంత్రి పదవి ఇస్తే సాక్షులపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని.. బెయిల్ మంజూరు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పిటిషన్‌లో కోరారు.

కేసును విచారించిన న్యాయస్థానం.. 'మేము బెయిల్ మంజూరు చేశాం.. మరుసటి రోజు వెళ్లి మంత్రి అవుతారు.. మీరు సీనియర్ క్యాబినెట్ మంత్రిగా ఉన్నందున సాక్షి ఒత్తిడికి లోనవుతారు.. ఏం జరుగుతోంది? అని జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ సంద‌ర్భంగా ప్ర‌శ్నించింది.

ఈరోజు నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు కేసును డిసెంబర్ 13 వరకు వాయిదా వేసింది. సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరు చేసిన చట్టం.. ఇతర వ్యక్తులకు కూడా ప్రయోజనం చేకూర్చింది కాబట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని కోర్టు తెలిపింది. సెంథిల్ బాలాజీ డీఎంకేతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత డీఎంకేలోకి తిరిగి వచ్చే ముందు ఏఐఏడీఎంకేకు వెళ్లారు. జయలలిత ప్రభుత్వంలో 2011 నుంచి 2015 వరకు తమిళనాడు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలకు సంబంధించి గతేడాది జూన్‌లో ఆయన అరెస్టయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఎనిమిది నెలల తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబరులో బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజుల తర్వాత.. MK స్టాలిన్ ప్రభుత్వం ఆయనను తిరిగి మంత్రిగా నియమించింది.

Next Story