రెండు వేల నోట్ల రద్దు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందా?
What India's decision to scrap its Rs 2000 note means for its economy. 2016లో నోట్ల రద్దు తర్వాత భారత ప్రభుత్వం కొత్త రూ.2000 నోటును విడుదల చేసింది.
By Medi Samrat Published on 20 May 2023 6:15 AM GMT2016లో నోట్ల రద్దు తర్వాత భారత ప్రభుత్వం కొత్త రూ.2000 నోటును విడుదల చేసింది. నోట్ల ముద్రణ త్వరగా జరిగేలా చూస్తామని, పాత కరెన్సీని కొత్త కరెన్సీతో సులభంగా మార్చవచ్చని ప్రభుత్వం ఈ నోటును విడుదల చేస్తూ వాదించింది. దీని ఫలితంగా మార్చి 2017 వరకు దేశంలో నడిచిన కరెన్సీలో 89 శాతం 2000 నోట్లే ఉండటం గమనార్హం. నల్లధనాన్ని అరికట్టేందుకు, ఒకే చోట డబ్బు జమ చేయకుండా ప్రభుత్వం జీపీఎస్ చిప్‌ను కూడా ఇందులో అమర్చిందని అప్పట్లో ఈ నోటుపై పలు వాదనలు వినిపించాయి. కాలక్రమేణా అందులో చిప్ లేదని, ఇది కూడా సాధారణ బ్యాంకు నోటు లాంటిదని తేలిపోయింది.
శుక్రవారం రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మే 23 నుండి సెప్టెంబరు 30 వరకు, ప్రజలు బ్యాంకుకు వెళ్లి వారివద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. గరిష్టంగా రూ.20,000 లేదా 10 నోట్లను ఒకసారి మార్చుకోవచ్చని పేర్కొంది. మార్చి 31, 2017 నాటికి దేశంలో మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో 89 శాతం 2000 నోట్ల రూపంలోనే ఉండగా.. మార్చి 31, 2018 నాటికి రూ.6.73 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. మార్చి 31, 2023 నాటికి రూ. 3.62 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఇది దేశం మొత్తం కరెన్సీలో 10.8 శాతం ఉండటం విశేషం.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు డిజిటల్ చెల్లింపులను పెద్ద సంఖ్యలో ఉపయోగించడం ప్రారంభించినందున.. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపదని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో నల్లధనాన్ని దాచుకోవడానికి 2000 నోటును ఉపయోగించారని కొందరు.. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిదని భావిస్తున్నారు. రూ.2000 నోటు చలామణి రద్దు తర్వాత మార్కెట్లోకి ఎక్కువ డబ్బు వస్తుంది. స్టాక్ మార్కెట్ కూడా దాని నుండి ప్రయోజనం పొందవచ్చని అంటున్నారు.