కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అనర్హత వేటుకు గురైన కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే విషయమై అంతా చర్చ నడుస్తోంది. నిజానికి రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం తొలగించిన తర్వాత వాయనాడ్ స్థానానికి మళ్లీ ఎన్నిక జరగాల్సి ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు వాయనాడ్ స్థానానికి కూడా ఉప ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని చెప్పినప్పటికీ అది జరగలేదు. కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలు, లోక్‌సభలకు ఉప ఎన్నికలను మాత్రమే ఎన్నికల సంఘం ప్రకటించింది.
పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ స్థానంతో పాటు ఒడిశాలోని ఝార్సుగూడ, యూపీలోని చన్బే, స్వర్, మేఘాలయలోని సోహియాంగ్ అసెంబ్లీ స్థానానికి కూడా మే 10న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. మే 13న ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వాయనాడ్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. "ఏదైనా ఖాళీ ఏర్పడితే ఉప ఎన్నిక నిర్వహించడానికి ఆరు నెలల సమయం ఉంది. మేము తొందరపడము. ట్రయల్ కోర్టు 30 రోజుల సమయం ఇచ్చింది. కాబట్టి, మేము వేచి ఉంటాము" అని చెప్పారు."
గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి రెండేళ్ల శిక్ష విధించడం గమనార్హం. దోషిగా తేలడంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడింది. దీంతో వాయనాడ్ లోక్‌సభ స్థానం ఖాళీ అయింది.