Kolkata : హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది దుర్మ‌ర‌ణం

కోల్‌కతాలోని ఫల్‌పట్టి ఫిషర్‌మెన్ ఏరియా సమీపంలోని ఓ హోటల్‌లో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు.

By Medi Samrat
Published on : 30 April 2025 8:17 AM IST

Kolkata : హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది దుర్మ‌ర‌ణం

కోల్‌కతాలోని ఫల్‌పట్టి ఫిషర్‌మెన్ ఏరియా సమీపంలోని ఓ హోటల్‌లో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు. ఈ ఘోర ప్రమాదం 'రితురాజ్ హోటల్' వద్ద రాత్రి 8:15 గంటల ప్రాంతంలో జరిగింది. ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికి తీశామని, చాలా మందిని రక్షించి సురక్షితంగా బయటకు తీశామని కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ తెలిపారు.

ప్రస్తుతం మంటలు అదుపులోకి తెచ్చామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, దీనిపై విచారణ జరుపుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వర్మ తెలిపారు. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

కేంద్ర మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ప్ర‌మాదంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు వైద్యం అందించాలని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని రాష్ట్ర అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నానని, దీనితో పాటు అగ్నిప్రమాదం వంటి సంఘటనలు జరగకుండా అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షించాలని ఆయన అన్నారు.

అదే సమయంలో కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పని తీరుపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభాంకర్ సర్కార్ ప్రశ్నలు సంధించారు. "ఇది చాలా విచారించదగ్గ సంఘటన. హోటల్‌లో మంటలు చెలరేగాయి, ఇంకా చాలా మంది లోపల చిక్కుకున్నారు. భద్రతా ఏర్పాట్లు లేవు. కార్పొరేషన్ ఏమి చేస్తుందో నాకు అర్థం కావడం లేదు" అని ఆయన అన్నారు.

Next Story