మేము గాంధీజీ రాముడిని ఆరాధిస్తాం.. బీజేపీ రాముడిని కాదు
అయోధ్యలో బాల రాముడు ఆలయంలో కొలువు దీరాడు. ప్రధాని మోదీ చేతలు మీదుగా అభిజిత్ లగ్నంలో
By Medi Samrat Published on 22 Jan 2024 12:27 PM GMTఅయోధ్యలో బాల రాముడు ఆలయంలో కొలువు దీరాడు. ప్రధాని మోదీ చేతలు మీదుగా అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ఈ సమయంలో అయోధ్య రామ నాయ స్మరణతో మారు మోగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామలల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు.
ఇలాంటి సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య "మేము (కాంగ్రెస్) గాంధీ రాముడిని పూజిస్తాము, బీజేపీకి చెందిన రాముడిని కాదు" అంటూ సరికొత్త వివాదాన్ని రేకెత్తించారు. రాముడిని సీత, లక్ష్మణుల నుంచి వేరు చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని సిద్ధరామయ్య బీజేపీని విమర్శించారు. లక్ష్మణుడు, సీత లేకుండా రాముడు లేడని, రాముడు కేవలం అయోధ్యకే పరిమితం కాలేదని అన్నారు.
అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా సీనియర్ నేతలకు ఆహ్వానాలు వచ్చినా.. ఆ పార్టీ నేతలు హాజరు అవ్వలేదు. ఈ కార్యక్రమం బీజేపీ తన సొంత కార్యక్రమంలా చేస్తూ వచ్చిందని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేతలు.