పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బ్రిటన్ నుండి కోల్‌కతాకు నడిచే అన్ని ప్రత్యక్ష విమానాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఓమిక్రాన్ కేసుల నేఫథ్యంలో జనవరి 3 నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ నిర్ణయాన్ని అమలుచేయనుంది. జనవరి 3 నుండి నాన్-రిస్క్ దేశాల నుండి అంతర్జాతీయ విమానాల ద్వారా పశ్చిమ బెంగాల్‌కు వచ్చే ప్రయాణీకులందరూ తప్పనిసరిగా వారి ఖర్చులతోనే పరీక్షలు చేయించుకోవాలి. ఎయిర్‌లైన్స్ 10% మంది ప్రయాణీకులను RT-PCR పరీక్ష కోసం ఎంపిక చేస్తుంది. మిగిలిన 90% మంది ప్రయాణీకులు విమానాశ్రయంలో రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) చేయించుకుంటారు. ఆ పరీక్షలో పాజిటివ్ వచ్చినవారు ఆరోగ్య అధికారులు సూచించిన విధంగా RT-PCR పరీక్షలు చేయించుకోవాలి.
ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. కోల్‌కతాలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయని.. ఇది రైళ్లు, విమానాలలో ప్రయాణించే ప్రజలకు రవాణా కేంద్రం. బ్రిటన్ నుండి విమానాలలో వచ్చేవారిలో చాలా ఓమిక్రాన్ కేసులు గుర్తించబడుతున్నాయి. ఓమిక్రాన్ క్యారియర్‌లు అంతర్జాతీయ విమానాల ద్వారా వస్తున్నాయన్నది వాస్తవం. ఓమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల నుండి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి" అని ఆమె అన్నారు.