వక్ఫ్ సవరణల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
వక్ఫ్ సవరణల బిల్లు- 2025 కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
By Knakam Karthik
వక్ఫ్ సవరణల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
వక్ఫ్ సవరణల బిల్లు- 2025 కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు.. శనివారం నుంచి చట్టంగా అమల్లోకి వచ్చింది. ఇటీవలే ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బుధ, గురువారాల్లో లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రెండు సభల్లో దాదాపు చెరో 12 గంటల చొప్పున బిల్లుపై చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాలు బిల్లుపై సమగ్రంగా చర్చ జరిపాయి. ఈ బిల్లుకు లోక్‌సభలో 288 మంది అనుకూలం తెలుపగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక రాజ్యసభలో 128 మంది మద్దతు తెలుపగా, 95 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. రెండు సభల్లోనూ ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి.
ఇరు సభల్లో చర్చల సందర్భంగా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లు ఆవశ్యకతను తెలియజేశారు. ఈ బిల్లు తేకపోయి ఉంటే.. రాబోయే కాలంలో పార్లమెంట్ భవనం ఉన్న స్థలం కూడా వక్ఫ్‌దేనని పేర్కొనే ప్రమాదం ఉండేదని వెల్లడించారు. ఈ బిల్లుతో పేద, మహిళా ముస్లింలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.