వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. ప్రతిపక్షాలకు షాక్..!

వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ సమావేశం నేటితో ముగిసింది.

By Medi Samrat
Published on : 27 Jan 2025 2:47 PM IST

వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. ప్రతిపక్షాలకు షాక్..!

వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ సమావేశం నేటితో ముగిసింది. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సభ్యులు ప్రతిపాదించిన మొత్తం 14 సవరణలను పార్లమెంటరీ కమిటీ సోమవారం ఆమోదించింది. అదే సమయంలో, ప్రతిపక్ష సభ్యులు సమర్పించిన ప్రతి మార్పును తిరస్కరించారు. కమిటీ ఆమోదించిన సవరణలు చట్టాన్ని మరింత మెరుగ్గా, మరింత ప్రభావవంతంగా మారుస్తాయని కమిటీ చైర్‌పర్సన్ జగదాంబిక పాల్ సమావేశం అనంతరం విలేకరులతో అన్నారు.

అయితే, ప్రతిపక్ష ఎంపీలు సమావేశ కార్యక్రమాలను ఖండించారు. జగదాంబిక పాల్ ప్రజాస్వామ్య ప్రక్రియను వక్రీకరించారని ఆరోపించారు. "ఇది హాస్యాస్పదం. మా అభిప్రాయాలను వినలేదు. పాల్ నియంతృత్వ ధోరణిలో ప్రవర్తించారు" అని TMC ఎంపీ కళ్యాణ్ బెనర్జీ విలేకరులతో అన్నారు.

జగదాంబికా పాల్ ప్రతిపక్షాల ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చారు.. మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని.. మెజారిటీ అభిప్రాయాన్ని కొనసాగించామ‌ని అన్నారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈరోజు క్లాజ్ వారీగా సమావేశం జరిగింది.. 44 క్లాజులపై విపక్ష సభ్యులు సవరణలు చేశారు.. సవరణలు ఉన్నాయా అని సభ్యులను అడిగాను. సవరణలు సూచిస్తామని చెప్పారు. ఇంతకంటే ప్రజాస్వామ్యం మరొకటి ఉండదు. నేడు ఆమోదించబడిన సవరణలు మంచి బిల్లును తయారు చేస్తుందని నేను భావిస్తున్నాను అని అన్నారు. బిల్లులోని 14 సెక్షన్లలో ఎన్డీయే సభ్యులు చేసిన సవరణలను ఆమోదించినట్లు జగదాంబిక పాల్ తెలిపారు. మొత్తం 44 క్లాజుల్లో ప్రతిపక్ష సభ్యులు వందలాది సవరణలు చేశారని, అవన్నీ ఓటింగ్‌తో వీగిపోయాయని ఆయన అన్నారు.

జేపీసీ సమావేశంలో పలుమార్లు తీవ్ర గందరగోళం నెలకొనడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తనను దుర్భాషలాడారని జగదాంబిక పాల్ ఆరోపించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రతిపాదన మేరకు 10 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. గతేడాది అక్టోబర్ 22న జరిగిన సమావేశంలో కూడా పలువురు నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Next Story