చిన్నమ్మకు మళ్ళీ నిరాశనే..
VK Sasikala's plea for early release rejected. జయలలిత-శశికళ ఈ పేర్లు అప్పట్లో తమిళనాడు రాజకీయాలను శాసించాయి.
By Medi Samrat Published on 5 Dec 2020 6:13 PM IST
జయలలిత-శశికళ ఈ పేర్లు అప్పట్లో తమిళనాడు రాజకీయాలను శాసించాయి. జయలలిత మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా శశికళ మీద కూడా ఎన్నో అనుమానాలు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఇక శశికళ జైలు నుండి విడుదల కాబోతోంది అతి త్వరలో.. చిన్నమ్మ రాజకీయాల్లో చక్రం తిప్పనుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో శశికళకు మళ్ళీ నిరాశనే ఎదురైంది.
శశికళ విడుదల అవ్వబోతోందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ కర్ణాటక హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. శశికళ అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. తన శిక్ష కాలాన్ని తగ్గించాలని శశికళ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. జరిమానా తాలూకు రూ.10 కోట్లను ఆమె చెల్లించారని, దాంతో జనవరిలో ఆమె విడుదల కావొచ్చని అన్నారు. కానీ కర్ణాటక హైకోర్టు తాజా నిర్ణయంతో చిన్నమ్మ వర్గానికి షాక్ తగిలింది. శశికళ ఎప్పుడు విడుదలవుతుందా అనే క్లారిటీ ఎవరిలోనూ లేకపోవడంతో మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో శశికళను తమిళనాడు ఓటర్లు నమ్ముతారో లేదో కూడా తెలియని పరిస్థితి. జయలలిత నిచ్చెలి శశికళ అన్న ఒకే ఒక్క కారణంతో ఆమెను ప్రజలు స్వాగతించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.