గుజరాత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్‌సింగ్ వాఘేలా ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనకు ఒకరోజు ముందు రాజీనామా చేయడం గమనార్హం. త్వరలో గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. అలాగే.. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 'భారత్ జోడో యాత్ర'కు ముందు బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.
సెప్టెంబర్ 5న అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో బూత్ స్థాయి కార్యకర్తల 'పరివర్తన్ సంకల్ప్' సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. విశ్వనాథ్‌సింగ్ వాఘేలా రాజీనామాపై గుజరాత్ బిజెపి అధికార ప్రతినిధి రుత్విజ్ పటేల్ స్పందిస్తూ.. "రాహుల్ గాంధీ రేపు 'కాంగ్రెస్‌లో చేరండి' ప్రచారానికి గుజరాత్ వస్తున్నారని, అయితే రాష్ట్రంలో 'క్విట్ కాంగ్రెస్ ప్రచారం' కొనసాగుతోందని అన్నారు. 35 ఏళ్ల విశ్వనాథ్‌సింగ్ వాఘేలా ఈ ఏడాది జనవరిలో గుజరాత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఇటీవల గులాం నబీ ఆజాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఇటీవలే ఆ పార్టీని వీడారు. ప్రియాంక చతుర్వేది కూడా కాంగ్రెస్‌ను వీడి శివసేనలో చేరారు.