కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకునే క్రమంలో మహిళలకు కేఎస్ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం హామీని ప్రకటించింది. అప్పటినుంచి ఆర్టీసీ బస్సులలో సీట్ల కోసం మహిళల మధ్య జరుగుతున్న గొడవలకు సంబంధించిన వీడియోలు అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి. అవి కాస్తా వైరల్ అయ్యి.. నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తాజాగా కర్ణాటకలోని తుమకూరులో కేఎస్ఆర్టీసీ బస్సులో మహిళల కొట్టుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతోంది. నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వీడియో.. చర్చకు దారితీసింది. వీడియోలో.. సీటు కోసం గొడవపడుతున్న ఇద్దరు మహిళలను చూడవచ్చు. ఇద్దరూ ఒకరి జుట్టును ఒకరు లాగడం, శారీరకంగా ఒకరిపై ఇకరు దాడి చేసుకోవడం.. బస్సులోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని వారి గొడవను ఆపేందుకు వారించడం చూడవచ్చు.
కర్నాటకలోని తుమకూరులో జరిగిన ఈ ఘటనను ఓ ప్రేక్షకుడు చిత్రీకరించి ట్విటర్‌లో షేర్ చేశాడు. పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే.. వీడియోను 1,62,000 మంది వీక్షించారు. ఈ వీడియో పట్ల నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు వాగ్వివాదాన్ని WWE రెజ్లింగ్ మ్యాచ్‌తో పోల్చగా.. చాలా మంది ఘటనపట్ల వారి ఆందోళన, బాధను వ్యక్తం చేశారు. మరికొంత మంది ఈ ఘటనను వీడియో తీయటం కంటే గొడవను ఆపడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.