బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారత్‌లోనూ రావచ్చు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు.. బీజేపీ సీరియస్
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత అక్కడ చెలరేగిన హింసాకాండపై దేశం మొత్తం ఆందోళన చెందుతోంది.
By Medi Samrat Published on 7 Aug 2024 2:29 PM ISTబంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత అక్కడ చెలరేగిన హింసాకాండపై దేశం మొత్తం ఆందోళన చెందుతోంది. బంగ్లాదేశ్ పరిస్థితిపై ప్రతిపక్షం కూడా ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన కామెంట్స్ చేశారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్నదే భారత్‌లో కూడా జరుగుతుందని మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. పైకి అంతా బాగానే అనిపించినా ఇక్కడ కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి రావచ్చునని అన్నారు.
దేశంలో ఎవరినైనా రెచ్చగొట్టేందుకు సల్మాన్ ఖుర్షీద్ ప్రయత్నిస్తున్నారా అని బీజేపీ ప్రశ్నించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. భారతదేశంలోని హిందువులపై దాడి చేసేందుకు సల్మాన్ ఖుర్షీద్ తన ప్రకటనతో ఎవరినైనా రెచ్చగొడుతున్నారా? రాజకీయ వ్యతిరేకతను దేశ వ్యతిరేక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బంగ్లాదేశ్ విషయంలో భారత ప్రభుత్వానికి అండగా ఉంటామని ఒకవైపు కాంగ్రెస్ చెబుతోందని షాజాద్ పూనావాలా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన స్టాండ్‌కు విరుద్ధంగా.. ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, సంజయ్ రౌత్, మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్త్జా ముఫ్తీలు ప్రజలను రెచ్చగొట్టే పనిలో పడ్డారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో భారత్‌లో కూడా జరుగుతుందని సల్మాన్ ఖుర్షీద్ చెబుతున్నారని అన్నారు. ఇది ఎవరినైనా రెచ్చగొట్టే ప్రయత్నమా.. లేక ఎవరికైనా ఐడియాలు ఇచ్చే ప్రయత్నమా అని పూనావాలా ప్రశ్నించారు.
మంగళవారం ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ వంటి హింసాత్మక సంఘటనలు భారతదేశంలో కూడా జరగవచ్చని అన్నారు. కాశ్మీర్, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉపరితలంపై ప్రతిదీ సాధారణంగా కనిపిస్తుందని.. అయితే దిగువ స్థాయిలో అలా కాదని అన్నారు. బంగ్లాదేశ్ లాంటి ఘటన భారత్‌లోనూ జరగొచ్చని అన్నారు. ఈ సమయంలో ఆయన ఇలాంటి ప్రకటనలు చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ వ్యతిరేక నిరసనలు, హింసాత్మక ఘర్షణల మధ్య తిరుగుబాటు జరిగింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి రాజధాని ఢాకా విడిచిపెట్టి ఇండియా చేరుకున్నారు.
మంగళవారం రాత్రి బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి పదవికి నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నియమితులయ్యారు. విద్యార్థి ఉద్యమ సమన్వయ మండలి సభ్యులు 13 మందితో మాట్లాడిన అనంతరం యూనస్ నియామకాన్ని అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు.