సీపీ రాధాకృష్ణన్‌.. ఆ పేరు వెనుక ఉన్న అస‌లు క‌థ చెప్పిన త‌ల్లి..!

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఆనందం వెల్లివిరిసింది.

By Medi Samrat
Published on : 18 Aug 2025 9:48 AM IST

సీపీ రాధాకృష్ణన్‌.. ఆ పేరు వెనుక ఉన్న అస‌లు క‌థ చెప్పిన త‌ల్లి..!

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఆనందం వెల్లివిరిసింది. రాధాకృష్ణన్ తల్లి జానకి అమ్మాళ్ ఆనందానికి అవధులు లేవు. సీపీ రాధాకృష్ణన్ సీపీఆర్‌ పేరుతో అందరికీ సుప‌రిచితులు. అయితే ఆయ‌న‌ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

సీపీ రాధాకృష్ణన్‌ తల్లి జానకి అమ్మాళ్‌ మాట్లాడుతూ.. ‘‘మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌లా ఉండాలనే ఆశయంతో మా కొడుక్కి సీపీ రాధాకృష్ణ అని పేరు పెట్టాం. సుందరమూర్తి గారు మా మాట విన్నారు. గణేశుడు అతనికి తన ఆశీస్సులు అందించాలి. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

సీపీ రాధాకృష్ణన్ తమిళనాడులో బీజేపీకి ముఖ్య‌మైన నేత‌. ఆయ‌న‌ 1998, 1999లో వరుసగా రెండు సార్లు కోయంబత్తూరు స్థానం నుండి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా ప‌ని చేశారు. ఇది కాకుండా.. జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరిలో పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న‌ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికలో సీపీ రాధాకృష్ణన్ గెలిస్తే.. వెంకటరామన్ తర్వాత ఈ పదవిని చేపట్టిన మూడో త‌మిళ‌నాడు వ్యక్తిగా నిలుస్తారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా తమిళనాడుకు చెందిన వారే. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కూడా కేంద్ర‌ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. అయితే.. సభలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి డీఎంకే స్పష్టంగా నిరాకరించింది. అయితే.. బీజేపీకి తగినంత మంది ఎంపీలు ఉన్నారు. దీని వల్ల సీపీ రాధాకృష్ణన్ ఎన్నికల్లో సులభంగా గెలుపొందుతారు. ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి.

Next Story