వరవరరావు... ఆయన ఆరోగ్యం ఇటీవలి కాలంలో సరిగా లేదు. ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని ఆయన కుటుంబ సభ్యులు తెగ టెన్షన్ పడుతూ ఉన్నారు. తాజాగా ఆయన విషయంలో బాంబే హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. వరవరరావు 2021, జనవరి 7 వరకు నానావతి ఆసుపత్రిలో ఉండేందుకు బాంబే హైకోర్టు అనుమతిచ్చింది. జైలులో ఉన్న 81 ఏళ్ల వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో కోర్టు సూచన మేరకు ఆయనను గత నెలలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్న 'మహా' ప్రభుత్వం, ఎన్ఐఏల అభ్యర్థనను కోర్టు నిన్న తిరస్కరించింది. జనవరి ఏడో తేదీ వరకు నానావతి ఆసుపత్రిలో ఉండేందుకు వరవరరావుకు అనుమతిచ్చింది. వరవరరావు బెయిలు పిటిషన్‌ను మాత్రం జనవరి 7కు వాయిదా వేసింది. వరవరరావుకు ఆరోగ్యానికి సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. వరవరరావు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు ఆయన తరపు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కోర్టుకు తెలిపారు. వరవరరావును జైలు నుండి విడుదల చేయాలని పలువురు కోరుతూ ఉన్నారు.