రెండున్నరేళ్ల తర్వాత బయటకు వచ్చిన వరవరరావు
Varavara Rao Released From Jail. ప్రముఖ విప్లవ కవి వరవరరావు రెండున్నరేళ్ల తర్వాత బయటకు వచ్చారు.
By Medi Samrat Published on 7 March 2021 2:08 PM GMTభీమా కోరేగాం కేసులో నిందితుడిగా ఆరోపించబడిన వరవరరావు రెండున్నరేళ్లుగా ముంబైలోని తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆయన్ను కోర్టు ఆదేశాల మేరకు నానావతి ఆసుపత్రిలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఇప్పుడాయన కోలుకుని బయటకు వచ్చారు.
గత నెలలో అనారోగ్య కారణాలతో ఆయనకు ముంబయి హైకోర్టు ఆరు నెలల పాటు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు జోక్యంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి నానావతి ఆసుపత్రిలో చేర్చింది. శనివారం రాత్రి ఆయన ముంబయి నానావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని వరవరరావు తరుపు న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది' అంటూ నానావతి ఆసుపత్రి బయట వరవరరావు దిగిన ఫోటోను జత చేశారు. జాతీయ దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు ఆయన పాస్‌పోర్ట్‌ను అప్పగించనున్నారు. ఇదే కేసులో అరెస్టైన సహ నిందితులతో ఆయన మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు. 50 వేలు విలువ చేసే రెండు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.