జ్ఞానవాపి మసీదు కేసులో శుక్రవారం వారణాసి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మసీదులో లభ్యమైన శివ లింగానికి కార్బన్ డేటింగ్ చేయించాలంటూ పలు హిందూ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌లను కోర్టు కొట్టివేసింది. శివ లింగానికి కార్బన్ డేటింగ్ చేయించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. శివ లింగానికి కార్బన్ డేటింగ్ చేయిస్తే, మసీదు కంటే ముందు అక్కడ ఆలయమే ఉందన్న విషయం తేలిపోతుందని భావించిన హిందూ సంఘాలు.. శివ లింగానికి కార్బన్ డేటింగ్ చేయించాలంటూ కోర్టును ఆశ్రయించాయి. అయితే కోర్టు అందుకు అంగీకరించలేదు.
మసీదు సముదాయంలోని శివలింగంపై కార్బన్ డేటింగ్, శాస్త్రీయ పరిశోధన కోరుతూ హిందూ పక్షం చేసిన డిమాండ్‌ను వారణాసి కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. వారణాసి కోర్టు ఆదేశాలను బట్టి హిందూ సంఘాలు హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నాయి. "కార్బన్ డేటింగ్ కోరాలన్న మా డిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. మేము ఆర్డర్ కాపీ కోసం ఎదురు చూస్తున్నాము. హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. మేము మా అభిప్రాయాన్ని హైకోర్టు ముందు కూడా ఉంచుతాము" అని న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ అన్నారు.