వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్

వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మధ్యప్రదేశ్‌లోని కజురహో-ఉత్తరప్రదేశ్‌లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు ట్రయల్‌రన్‌ నిర్వహించారు.

By Medi Samrat  Published on  24 Dec 2024 4:04 PM IST
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్

వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మధ్యప్రదేశ్‌లోని కజురహో-ఉత్తరప్రదేశ్‌లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. చైన్నై ఐసీఎఫ్‌ నుంచి కజురహో చేరిన వందేభారత్‌ స్లీపర్‌ రైలు అక్కడి నుంచి మహోబాకు చేరుకుంది. ఆ తర్వాత కజురహో నుంచి తిరిగి మహోబాకు వచ్చింది. ట్రయల్ రన్ సమయంలో రైలు ఖజురహో నుండి మహోబా రైల్వే స్టేషన్ వరకు గంటకు 115 కిలో మీటర్ల వేగంతో నడిచింది. ఆ తర్వాత వేగాన్ని గంటకు 130 కిలోమీటర్లకు పెంచారు.

వందేభారత్‌ రైలును గంటకు 160 నుంచి 200 కిలో మీటర్ల స్పీడ్‌తో వెళ్లేలా తయారు చేశారు. 2025లో వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్‌ రైల్వే భావిస్తోంది. సుదూర, మధ్యస్థ దూర ప్రయాణాల కోసం ఉపయోగించేలా వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఆధునిక ఫీచర్లు, సౌకర్యాలు ఉంటాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వందే భారత్‌ స్లీపర్‌ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్‌, నాలుగు సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ప్రస్తుతం 10 స్లీపర్ రైళ్ల ఉత్పత్తి జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. 200 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీని సాంకేతిక భాగస్వాములకు కేటాయించామని మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలోనే తెలిపారు.

Next Story