వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. .భయపడిపోయిన ప్రయాణికులు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లోని కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 17 July 2023 10:12 AM ISTవందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లోని కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌లో భోపాల్ నుండి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ టెర్మినల్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, మంటలు ఆర్పివేయబడ్డాయని ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. భారతీయ రైల్వే తెలిపిన వివరాల ప్రకారం.. రైలు అంతకుముందు హబీబ్‌గంజ్‌గా పిలువబడే రాణి కమలాపతి స్టేషన్ నుండి న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ వైపు బయలుదేరినప్పుడు ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో మంటలు వ్యాపించాయి. పూర్తి పరీక్ష అనంతరం రైలును త్వరలోనే పంపిస్తామని భారతీయ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
"అగ్నిమాపక దళం సమయానికి స్థలానికి చేరుకుంది. ఉదయం 07:58 గంటలకు మంటలు ఆర్పివేయబడ్డాయి" అని రైల్వే అధికారి తెలిపారు. ప్రమాద సమయంలో కోచ్‌లో 20-22 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిని వెంటనే ఇతర కోచ్‌లకు తరలించారు. సి-12 కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో ఉదయం 6.45 గంటలకు మంటలు చెలరేగడాన్ని కొందరు రైల్వే సిబ్బంది గమనించారు. దీంతో రాణి కమలాపతి-హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ రైలును విదిషా జిల్లాలోని కుర్వాయి - కైతోరా స్టేషన్ల మధ్య వెంటనే నిలిపివేశారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది రైలుకు మరమ్మతులు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో అందుబాటులోకి వచ్చిన మొదటి వందే భారత్ రైలు ఇదే. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఈ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.