ఇంకా రెండేళ్ల ప‌ద‌వీ కాలం ఉన్నా.. రాజీనామా చేసిన‌ గవర్నర్

Uttarakhand Governor Baby Rani Maurya Resigns. ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలం పూర్తి

By Medi Samrat  Published on  8 Sep 2021 11:29 AM GMT
ఇంకా రెండేళ్ల ప‌ద‌వీ కాలం ఉన్నా.. రాజీనామా చేసిన‌ గవర్నర్

ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలం పూర్తి కావడానికి ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపారు. గవర్నర్ కార్యదర్శి బ్రిజేష్ కుమార్ సంత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బేబీ రాణి మౌర్య, ఉత్తరాఖండ్ గవర్నర్ కావడానికి ముందు అనేక రాజకీయ, పరిపాలనా పదవులలో పనిచేశారు.

1995 నుండి 2000 వరకు ఆగ్రా మేయర్‌గా ఉన్నారు. 2001లో యూపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలుగా, 2002లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా పని చేశారు. 1996లో ఆమెకు సమాజ్ రత్న, 1997లో ఉత్తర ప్రదేశ్ రత్న, 1998లో నారి రత్న అవార్డులు లభించాయి. 1956లో జన్మించిన బేబీ రాణి మౌర్య, 2018 ఆగస్టులో ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాఖండ్‌ తొలి మహిళా గవర్నర్ మార్గరెట్ అల్వా తర్వాత ఆ రాష్ట్రానికి రెండో మహిళా గవర్నర్‌గా ఆమె వ్యవహరించారు.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో బేబీ రాణి మౌర్యకు భారతీయ జనతా పార్టీ కీలక బాధ్యతలు అప్పగించవచ్చని భావిస్తూ ఉన్నారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్మాద్‌పూర్ స్థానం నుండి ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయ జీవితంలో ఆమె వెనుకడుగు వేశారు. బేబీ రాణి మౌర్య రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Next Story