ఉత్తరప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UPTET) 2021 పేపర్ లీక్ అయ్యిందని ఆరోపణల కారణంగా.. పరీక్షను రద్దు చేసినట్లు లా అండ్ ఆర్డర్ ADG ప్రశాంత్ కుమార్ తెలిపారు. పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు పరీక్ష రద్దు నిర్ణయం వెలువడింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక నెలలో పరీక్షను నిర్వహిస్తుందని కుమార్ తెలిపారు. "ఈరోజు జరగాల్సిన UPTET 2021 పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దు చేయబడింది. పేపర్ లీక్ కేసులో డజన్ల కొద్దీ అనుమానితులను ఎస్టీఎఫ్ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తోంది. యూపీ ప్రభుత్వం ఒక నెలలోపు పరీక్షను మళ్లీ నిర్వహిస్తుంది, "అని లా అండ్ ఆర్డర్ ఎడీజీ చెప్పారు.
పరీక్ష ప్రారంభానికి ముందే మథుర, ఘజియాబాద్, బులంద్‌షహర్‌లలో పేపర్ లీక్ అయినట్లు నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష రద్దుపై, పరీక్షకు సంబంధించిన తాజా తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎగ్జామ్ రెగ్యులేటరీ అథారిటీ సెక్రటరీ సంజయ్ ఉపాధ్యాయ్ తెలిపారు. ప్రాథమిక స్థాయికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, జూనియర్ స్థాయికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగాల్సి ఉంది. ప్రైమరీ స్థాయికి సంబంధించిన పరీక్ష ఉత్తరప్రదేశ్ అంతటా 2554 కేంద్రాల్లో జరగాల్సి ఉంది. ఆపై అప్పర్ ప్రైమరీ స్థాయికి 1754 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉంది.