ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదు సర్వేను వ్యతిరేకిస్తున్న వందలాది మంది నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. 20 మంది పోలీసు అధికారులతో సహా పలువురు గాయపడ్డారు. హింసకు ప్రతిస్పందనగా, అధికారులు కఠినమైన నిషేధాజ్ఞలను అమలు చేశారు. పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.
మొఘలులు ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారనే ఫిర్యాదుపై కోర్టు ఆదేశాల మేరకు ఈ సర్వే జరిగింది. సంభాల్‌లోని షాహీ మసీదును మొఘల్ కాలంలో ఆలయాన్ని కూల్చివేసి నిర్మించారనే ఫిర్యాదు మేరకు నిరసనకారులు అడ్వకేట్ కమిషన్ సర్వేను వ్యతిరేకించడంతో హింస చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లదాడికి దిగారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆందోళన గంటల తరబడి కొనసాగింది.
దుండగులు కాల్పులు జరిపారని, ఒక పోలీసు అధికారి కాలి లోకి తుపాకీ గుండు దూసుకొచ్చింది పోలీసులు తెలిపారు.ఈ హింసలో 15 నుండి 20 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరో పోలీసు తలకు బలమైన గాయం కాగా, డిప్యూటీ కలెక్టర్ కాలు విరిగింది.