అయోధ్య నగరంలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు కూడా నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెడుతూ.. సీఎం యోగిఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ మంత్రి వర్గం తీర్మానించింది. శ్రీరామ జన్మభూమి అయోధ్య నగరంలోని విమానాశ్రయానికి మర్యాద పురుషోత్తం శ్రీరాం పేరు పెడుతూ ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది.
అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ ప్రారంభమైంది. భూసేకరణ పూర్తి కాగానే కేంద్ర పౌరవిమానయాన శాఖ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టనుంది. అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని, యూపీలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా ఉండవచ్చని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ 2018 నవంబర్‌లో దీపావళి సందర్భంగా దీపాత్సవ్ సందర్భంగా ప్రకటించారు.అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టడంపై హిందూ సంస్థలు, సాధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇటీవల అయోధ్యలో దీపావళి సందర్భంగా రామజన్మభూమి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించారు. ఇది గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. కాగా, యూపీలో ఈ ఏడాది రైతులు చెల్లించే మండీ ఫీజును 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ కూడా యూపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.