ఒక మహిళ సమయస్ఫూర్తి కారణంగా పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్ జిల్లాలో ఒక పెద్ద రైలు ప్రమాదాన్ని నివారించడంలో ఆమె సహాయపడింది. 58 ఏళ్ల మహిళ ట్రాక్‌పై పగుళ్లను గమనించి, తన ఎరుపు రంగు చీరను ఉపయోగించి రైలును ఆపేలా సిగ్నల్ ఇచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఎటా జిల్లాలోని అవఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా గులేరియా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓంవతి అనే మహిళ గురువారం పొలాల్లో పని చేస్తూ, ఉదయం 8 గంటల సమయంలో రైలు ట్రాక్ దెబ్బతిన్న భాగాన్ని గుర్తించింది. ఓంవతి ఇంటి సమీపంలో ఉన్న పోల్ నంబర్ 33/78 సమీపంలో పగుళ్లు కనిపించాయి. రైలు మార్గానికి సమీపంలో నివసిస్తున్నందున, ఓంవతికి ఎటా-తుండ్ల ప్యాసింజర్ రైలు ఆ దెబ్బతిన్న ట్రాక్ గుండా వెళుతుందని తెలుసు.
దీంతో ఓంవతి తన ఇంటికి వెళ్లి ఎర్రటి చీర తెచ్చింది. ఆ తర్వాత ఆమె రెండు కర్రలను తీసుకుని, రైలు డ్రైవర్‌కు సిగ్నల్ ఇవ్వడానికి వాటిని ఉపయోగించి ఎర్రటి గుడ్డను వేలాడదీసింది. 150 మంది ప్రయాణికులతో ఉన్న రైలు ఆ ప్రదేశానికి చేరుకుంటూ ఉండగా.. ఓంవతి చీర ఊపుతూ రైలు వైపు పరుగెత్తడం ప్రారంభించింది. ఓంవతి చేసిన ప్రయత్నాల కారణంగా ఆమె రైలును విజయవంతంగా నిలిపివేసి, పెను ప్రమాదం తప్పించింది. కొంతమంది గ్రామస్తుల ప్రకారం, రైలు డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేసే ఓంవతి ట్రాక్ నుండి పక్కకు రాలేదని తెలుస్తోంది.
దెబ్బతిన్న ట్రాక్‌ను సీనియర్ రైల్వే అధికారుల పర్యవేక్షణలో మరమ్మతులు చేశారు. అనంతరం 45 నిమిషాల తర్వాత రైలును ముందుకు వెళ్ళడానికి అనుమతించారు. ఈ సంఘటన గురించి ఓంవతి మాట్లాడుతూ.. తాను నిరక్షరాస్యురాలు అయినప్పటికీ ఎరుపు రంగు ప్రమాదాన్ని సూచిస్తుంది అని తనకు తెలుసునని అన్నారు. తన సాహసోపేతమైన చర్యకు డ్రైవర్ తనకు రూ. 100 కూడా ఇచ్చాడని ఆమె తెలిపింది. ఓంవతి చేసిన పనికి ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి.