ఉత్తరప్రదేశ్‌లో COVID-19 పాజిటివిటీ రేటు, రోజువారీ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ వేళలు రాత్రి 10.00 నుండి ఉదయం 6.00 గంటల వరకు ఉన్నాయి, ఫిబ్రవరి 13 నుండి ఒక గంట సడలించబడింది. అయితే ఇప్పుడు పూర్తిగా ఎత్తివేశారు. "కరోనావైరస్ కేసులు గణనీయంగా తగ్గిన దృష్ట్యా, నేటి నుండి రాత్రి కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయించారు" అని అదనపు ప్రధాన కార్యదర్శి (హోమ్) అవనీష్ అవస్తీ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో 842 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య 20,63,9041కి చేరుకుంది. యాక్టివ్ కేసులు వారం క్రితం 15,000 నమోదవ్వగా.. ఇప్పుడు 8,683కి తగ్గాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు వేగంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో రోజువారీ COVID-19 కేసులు గత 13 రోజులుగా లక్ష కంటే తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో గత 24 గంటలలో కొత్తగా 22,279 మందికి కరోనా వైరస్ వ్యాపించింది. అదే సమయంలో 60,298 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో దేశంలో కొత్తగా 325 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి.