ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కెబినెట్‌లోని మంత్రి దారా సింగ్ చౌహాన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. కార్మిక మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం తన పదవికి రాజీనామా చేసి 24గంటలు గడవకముందే మరో మంత్రి బీజేపీని వీడటం యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు నిన్న మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా అధికార బీజేపీని వీడి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీలో చేరారు.
దారా సింగ్ చౌహాన్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. వెనుకబడిన తరగతులు, దళితులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ బుధవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసిన రెండవ ఉత్తరప్రదేశ్ మంత్రి దారా సింగ్ చౌహాన్. ఇదిలావుంటే.. పదమూడు మంది శాసనసభ సభ్యులు సమాజ్‌వాదీ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సంచలనానికి తెరలేపారు. వరుసగా నేతలు పార్టీని వీడుతుండటంతో బీజేపీ అధిస్టానం అయోమయంలో పడింది.