జైలులో ఖైదీ మృతి.. రెచ్చిపోయి జైలును తగలెట్టేశారు
UP jail inmates hold officials captive, set part of prison on fire over undertrial's death. టైటిల్ చూసి.. ఏ ఆఫ్రికా దేశంలోనో చోటు చేసుకున్న ఘటన అని అనుకోకండి..!
By Medi Samrat Published on 7 Nov 2021 7:06 PM ISTటైటిల్ చూసి.. ఏ ఆఫ్రికా దేశంలోనో చోటు చేసుకున్న ఘటన అని అనుకోకండి..! ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జైలులో చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీ మృతి చెందడంతో కోపోద్రిక్తులైన తోటి ఖైదీలు జైలుకు నిప్పుపెట్టారు. సిబ్బందిపై రాళ్లదాడికి దిగారు. జైలర్‌తో పాటు పోలీసులపై దాడి చేశారు. ఘటనలో 30 మంది పోలీసులతో పాటు ఖైదీలకు కూడా గాయాలయ్యాయి. వారందరినీ ఆసుప్రతిలో చేర్పించారు.
మేరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న సందీప్ హత్య కేసులో జిల్లా జైలులో ఉన్నాడు. ఇటీవలే సందీప్ డెంగీ బారినపడ్డాడు. పరిస్థితి విషమించడంతో సైఫాయి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జైలులో ఉన్న తోటి ఖైదీలు వీరంగం సృష్టించారు. జైలుకు నిప్పు పెట్టారు. జైలర్, ఇతర పోలీసులు జైలుకు చేరుకోగా వారిపై కూడా దాడి చేశారు. డెప్యూటీ జైలర్ శైలేష్‌కుమార్ సోంకర్‌పై దాడికి దిగడంతో ఖైదీలను అదుపు చేసేందుకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు జైలు అలారం నిరంతరాయంగా మోగింది. జైలు నుంచి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుక్ను సీఓసీటీ ప్రదీప్ సింగ్, ఫతేఘర్ కోత్వాల్ జైప్రకాశ్ పాల్ బలగాలతో జైలుకు చేరుకున్నారు.
సందీప్‌కు సకాలంలో వైద్యం అందలేదని, దీంతో అతడు చనిపోయాడని ఖైదీలో ఆరోపిస్తున్నారు. దీపావళి రోజున సరైన ఆహారం ఇవ్వలేదని విమర్శించారు. ఆ కోపాన్నంతా ఇలా చూపించినట్లు తెలుస్తోంది. ఫతేఘర్ సెంట్రల్ జైలు సీనియర్ సూపరింటెండెంట్ ప్రమోద్ శుక్లా మాట్లాడుతూ ఖైదీ సందీప్ యాదవ్ సైఫాయ్ చికిత్స పొందుతూ మరణించాడని.. ఖైదీ మృతి చెందిన సమాచారం అందిన వెంటనే జైలులో కలకలం రేగిందని అన్నారు. జైల్లో ఖైదీలు రాళ్లు రువ్వారని, నిప్పు పెట్టారన్నారు. ఆ తర్వాత జైలు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారన్నారు. ఖైదీ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై డీజీ ఆనంద్‌కుమార్ నివేదిక కోరారు. అలాగే డీఐజీ బీపీ త్రిపాఠిని సంఘటనపై విచారణ కోసం డీజీ ఫతేఘర్‌కు పంపారు.