ఇద్ద‌రు అమ్మాయిల ప్రేమ క‌థ‌లో ఊహించ‌ని ట్విస్ట్‌.. లింగ‌మార్పిడి చేయించుకున్న త‌రువాత‌

UP girl switches gender to marry girlfriend, but girlfriend backtracks.లింగ‌మార్పిడి చేయించుకున్న ఆమెతో క‌లిసి ఉండేందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2023 10:01 AM IST
ఇద్ద‌రు అమ్మాయిల ప్రేమ క‌థ‌లో ఊహించ‌ని ట్విస్ట్‌.. లింగ‌మార్పిడి చేయించుకున్న త‌రువాత‌

ప్రేమ.. ఎప్పుడు ఎవ‌రి మ‌ధ్య ఎలా ఎందుకు పుడుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. అలాగే ఇద్ద‌రు అమ్మాయిలు ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేక‌పోయారు. అనంత‌రం ఇద్ద‌రు పెళ్లితో ఒక్క‌టి అయ్యారు. ఇద్ద‌రిలో ఒక‌రు లింగ‌మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది. కానీ.. ఆ త‌రువాతే అస‌లు క‌థ మొద‌లైంది. లింగ‌మార్పిడి చేయించుకున్న ఆమెతో క‌లిసి ఉండేందుకు మ‌రో యువ‌తి నిరాక‌రించింది. దీంతో లింగ‌మార్పిడి చేయించుకున్న యువ‌తి కోర్టును ఆశ్ర‌యించింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఝూన్సీ జిల్లాకు చెందిన స‌నా ఖాన్‌, సోనాల్ శ్రీవాత్స‌వ అనే ఇద్ద‌రు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. 2017లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. అప్ప‌ట్లో వీరి పెళ్లి వార్త‌ల్లో నిలిచింది. అయితే.. ఇద్ద‌రం కలిసి జీవించాలంటే ఇద్ద‌రిలో ఒక‌రు పురుషుడిగా మారాల‌ని స‌నా ఖాన్‌కు సోనాల్ చెప్పింది.

రూ.6 లక్ష‌లు వ్య‌యం చేసి స‌నాఖాన్ లింగ‌మార్పిడి శ‌స్త్రచికిత్స చేయించుకుని పురుషుడిగా మారింది. అనంత‌రం త‌న పేరు సుహైల్ ఖాన్‌గా పెట్టుకుంది. కొద్ది రోజులు క‌లిసి జీవించారు. ఈ స‌మ‌యంలో సోనాల్‌కు ఓ ఆస్ప‌త్రిలో ఉద్యోగం వ‌చ్చింది. అక్క‌డ ఆమెకు ఓ అబ్బాయితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది కాస్త ప్రేమ‌గా మారింది. దీంతో స‌నాఖాన్ అలియాస్ సుహైల్ ఖాన్‌ను క్ర‌మంగా దూరం పెట్టసాగింది.

ఓ రోజు త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టింది. ఇక నీతో క‌లిసి ఉండ‌లేను. నీకు ఇలా ఇబ్బందిగా ఉంటే.. తిరిగి అమ్మాయిగా మారు అని సోనాల్ అంది. షాక్‌కు గురైన స‌నాఖాన్ కొద్ది సేప‌టికి తేరుకుంది. ఎంత న‌చ్చ‌జెప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. చేసేది లేక చివ‌ర‌కు గ‌తేడాది జూన్ 3న కోర్టును ఆశ్ర‌యించింది స‌నాఖాన్‌.

కేసు విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ప‌లు మార్లు కోర్టు నోటీసులు పంపిన‌ప్ప‌టికీ వాటిని తీసుకునేందుకు సోనాల్ నిరాక‌రించింది. దీంతో సోనాల్‌పై న్యాయ‌స్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఈ నెల 18న కోర్టులో హాజ‌రు ప‌రిచారు. అదే ఆమెకు బెయిల్ ల‌భించింది. న్యాయ‌స్థానం కేసు విచార‌ణ‌ను ఫిబ్ర‌వ‌రి 23కు వాయిదా వేసింది.

Next Story