లవ్ జిహాద్ విషయంలో యోగి సర్కార్ వెనక్కు తగ్గాల్సిందేనా..!
UP Epicentre Of Politics Of Hate. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే లవ్ జిహాద్ ఆర్డినెన్స్ ను తీసుకుని వచ్చింది.
By Medi Samrat Published on 30 Dec 2020 7:29 AM GMTఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే లవ్ జిహాద్ ఆర్డినెన్స్ ను తీసుకుని వచ్చింది. ఈ వివాదాస్పద లవ్ జిహాద్ ఆర్డినెన్స్ ను పలువురు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు సంతకం చేసిన లేఖను మంగళవారం విడుదల చేశారు. ద్వేషం, విభజన, మతోన్మాద రాజకీయాలకు కేంద్రంగా ఉత్తరప్రదేశ్ మారిందని, చట్టవిరుద్ధమైన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని లేఖలో తెలిపారు. దీనిలో సంతకం చేసిన వారిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు, ప్రధానమంత్రి మాజీ సలహాదారు టీకేఏ నాయర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ఇతర రాజకీయ నాయకులందరూ మీరు.. పాటిస్తామని ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని మరోసారి తిరిగి చదవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఒకప్పుడు గంగా-జమునా నాగరికతకు కేంద్రంగా బాసిల్లిన యూపీ.. ఇప్పుడు ద్వేషం, విభజన, మూర్ఖత్వ రాజకీయాలకు కేంద్రంగా మారిందని అన్నారు. భారతీయు పౌరుల హక్కుకు వ్యతిరేకంగా యూపీలోని ప్రభుత్వ యంత్రాంగం యువకులపై దారుణాలకు పాల్పడుతోందనిని లేఖలో చెప్పుకొచ్చారు. ఆర్డినెన్స్‌ని అడ్డుపెట్టుకుని మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన దారుణాల గురించి లేఖలో తెలియజేశారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు అమాయకపు జంటలను వేధింపులకు గురి చేశారని.. అందుకు సంబంధించిన ఉదాహరణలను కూడా లేఖలో తెలియజేశారు. పోలీసులు స్పందించడంలేదని దాడులకు పాల్పడ్డ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. యూపీ తీసుకొచ్చిన లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను అలహాబాద్ కోర్టు కూడా వ్యతిరేకించిందని లేఖలో తెలిపారు.