సర్వే ఫలితాలు.. యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా ఎంత మంది కోరుకుంటున్నారంటే..!
UP Elections 2022 Survey Results. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు తలమునకలై ఉన్నాయి.
By Medi Samrat Published on 8 Dec 2021 4:56 PM ISTఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు తలమునకలై ఉన్నాయి. రాజకీయ పార్టీల ర్యాలీలు మొదలయ్యి ఇప్పటికే చాలా రోజులు అయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటనలు చేసుకుంటూ వెళుతున్నారు. తాను చేసిన అభివృద్ధి ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలతో ముందుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ, అటు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లు కూడా ఇటీవలి కాలంలో దూకుడు పెంచారు.
ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రజలు ఇష్టపడుతున్నారో సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా మొదటి ఎంపికకు సంబంధించి ఏబీపీ సీవోటర్ సర్వే నిర్వహించింది. 7 వేల 509 మందిని అడిగి ఈ సర్వే చేయించారు ఏబీపీ సీవోటర్ సర్వే. ఇందులో చాలా మంది యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా తమ ఫస్ట్ ఛాయిస్‌గా చెప్పారు. సర్వే ప్రకారం, 44 శాతం మంది ప్రజలు యోగి ఆదిత్యనాథ్‌ను తమ మొదటి ఎంపికగా చెప్పారు. 31 శాతం మంది అఖిలేష్ యాదవ్ పేరు చెప్పగా, 15 శాతం మంది మాయావతి, కేవలం నాలుగు శాతం మంది ప్రియాంక గాంధీని తమ మొదటి ఎంపికగా పేర్కొన్నారు. రెండు శాతం మంది జయంత్ చౌదరిని సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పని తీరుపై 43 శాతం మంది తమ ఇష్టాన్ని తెలియజేసారు. 21 శాతం మంది పర్వాలేదని చెప్పగా, 36 శాతం మంది యోగి ఆదిత్యనాథ్ కు వ్యతిరేకంగా చెప్పుకొచ్చారు.
ఫేవరెట్ బీజేపీనే :
వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విజయం సాధించడం ఖాయం అని కొద్దిరోజుల కిందట వచ్చిన ఏబీపీ న్యూస్-సివోటర్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (SP) ప్రాబల్యం కొంచెం పెరిగినా.. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) మాత్రం పెద్దగా ప్రభావం చూపదని సర్వే తెలిపింది. 2017లో బీజేపీకి వచ్చిన సీట్లతో పోలిస్తే కాస్త తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఎన్నికల సంఘం జనవరిలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.