ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఒక ఖైదీకి మద్యం కొనుక్కోవడంలో సహాయం చేశారు పోలీసులు. అతడి చేతులకు బేడీలు ఉండగా.. మద్యం షాపులో మద్యం కొంటున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతోంది. ఖైదీకి మద్యం కొనుక్కోవడానికి ఒక పోలీసు అధికారి సహాయం చేస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ ఘటన కలకలం రేపడంతో విచారణకు ఆదేశించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 151 కింద కేసు నమోదైన ఖైదీని పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు తీసుకువెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
అతనికి ఇద్దరు పోలీసులు ఎస్కార్ట్‌గా ఉన్నారు. దారిలో ఖైదీ మద్యం షాపు ముందు ఆగి మద్యం కొనేందుకు వెళ్లాడు. అతడు కొంటూ ఉండగా పోలీసులలో ఒకరు అతనికి సహకరించారని ఆరోపించారు. ఈ తతంగమంతా దారిన వెళ్తున్న ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఖైదీకి మద్యం కొనేందుకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.