త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు విద్యుత్ బిల్లుల్లో 50 శాతం రాయితీని ప్రకటించారు. దీని వల్ల యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసీఎల్)పై ప్రతి ఏడాది దాదాపు రూ.1,000 కోట్ల అదనపు భారం పడనుంది. ఇందుకోసం యూపీపీసీఎల్‌కు ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుంది. విద్యుత్ రేటులో మినహాయింపును సీఎం యోగి ప్రకటించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాగానే ప్రస్తుత విద్యుత్ రేటును సవరిస్తారు.
ప్రస్తుత నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని మీటర్ల కనెక్షన్లలో యూనిట్ కు రూ.2 నుంచి రూ.1కి తగ్గనుండగా.. ఫిక్స్ డ్ చార్జీ రూ.70 నుంచి రూ.35కి తగ్గనుంది. మరోవైపు, మీటర్‌లెస్ విద్యుత్ కనెక్షన్‌లపై ఫిక్స్‌డ్ ఛార్జీ రూ.170 నుంచి రూ.85కి తగ్గనుంది. ఇంధన ఆదా చేసే పంపులకు గతంలో 1.65 యూనిట్లకు రూ.70 ఫిక్స్‌డ్ చార్జీ చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు రూ.35కి తగ్గనుంది. ఈ కొత్త ప్రకటన తర్వాత యూనిట్‌కు 0.83 పైసలు. నగరాల్లోని ప్రైవేట్ కనెక్షన్‌లకు యూనిట్‌కు 6 నుంచి రూ.3కు తగ్గనుంది. సీఎం యోగి ప్రకటనతో రాష్ట్రంలోని 13 లక్షల మంది ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
కొద్దిరోజుల క్రితం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా రాష్ట్రంలో 300-300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇవ్వడం ఎంతవరకు ప్రాక్టికల్ అనే అంశం చర్చనీయాంశమైనా, సీఎం యోగి మాత్రం ప్రస్తుతానికి రాయితీ ఇచ్చి రాష్ట్ర ప్రజలకు పెద్ద ఊరట కల్పించారు.