ఉత్తరప్రదేశ్ కొత్త క్యాబినెట్ శనివారం మొదటిసారి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉచిత రేషన్ పథకాన్ని జూన్ 30, 2022 వరకు మరో మూడు నెలల పాటు పొడిగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. శుక్రవారం రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే. "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మార్చి 31 నుండి జూన్ 30 వరకు పొడిగించాలని మేము నిర్ణయించాము. ఇది రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది" అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలో చెప్పారు.
ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యం అదనంగా లభిస్తుంది. 2020లో కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కేంద్రం దీనిని మొదటిసారిగా అమలు చేసింది. శనివారం సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. 'కొత్త కేబినెట్ తొలి నిర్ణయం ఇదేనని.. పారదర్శకంగా అమలు చేస్తామని' అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ మార్చి 25వ తేదీ శుక్రవారం నాడు రెండవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. యోగి చేత ప్రమాణం చేయించారు.